ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది

వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ చట్టం, ఐపీసీ 307 తదితర సెక్షన్ల కేసులను కొట్టేయాలంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయగా..కోర్ట్ విచారణ జరపకుండా కొట్టేవేయలేమని తేల్చి చెప్పింది.

టీడీపీ కార్యకర్త మాతంగి వెంకటకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటంరెడ్డిపై వేదాయపాలెం పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టం, ఐపీసీ 307 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, కేసు దర్యాప్తును నిలిపివేయడంతోపాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్ట్ ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులు, వెంకటకృష్ణకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో ఫిర్యాదుదారుడి వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.