మళ్లీ ఏపీ సర్కార్ తీరుపై హైకోర్టు మండిపాటు

High Court of AP
High Court of AP

ఏపీ సర్కార్ తీసుకునే నిర్ణయాల పట్ల హైకోర్టు ఎప్పటికప్పుడు తప్పుపడుతూనే ఉంది. రీసెంట్ గా టీటీడీ పాల‌క మండలిలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా 52 మందిని ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మిస్తూ ఇచ్చిన జీవోల‌పై హైకోర్టు స్టే ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఉపాధిహామీ ప‌థ‌కానికి సంబంధించి నిధుల‌ను చెల్లించ‌క‌పోవ‌డంపై కూడా కోర్టు ప‌లుమార్లు ఆగ్ర‌హించింది. ఇక ఇప్పుడు ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల‌ను త‌న ఆధీనంలోకి తీసుకుంటూ ప్ర‌భుత్వం జీవో జారీ చేయ‌డాన్ని ఏపీ హైకోర్టు త‌ప్పు ప‌ట్టింది.

రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ విద్యాసంస్థల అసోసియేషన్లు హైకోర్టులో దాఖ‌లు చేశాయి. వీటిపై హైకోర్టు శుక్ర‌వారం విచారణ జరిపింది. విచారణలో భాగంగా పిటిషనర్‌ ప్రొసీడింగ్స్‌ను ప్రధాన న్యాయమూర్తి చదివి వినిపించారు. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే విషయం కనపడుతోందని ధర్మాసనం అభిప్రాయప‌డింది. పిటిష‌న‌ర్ అభిప్రాయం విన్న న్యాయ‌స్థానం ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ నెల 29న డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ …కేసును ఆ రోజుకి వాయిదా వేసింది.