గణేష్ ఉత్సవాలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు

గణేష్ ఉత్సవాలపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్ సాగ‌ర్ లో ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ తో త‌యారు చేసిన విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేయడానికి వీలులేదని తేల్చి చెప్పింది. ఆ విగ్ర‌హాల‌ను కుంట‌ల్లో, చెరువుల్లో నిమ‌జ్జ‌నం చేయాలంటూ హైకోర్టు స్ప‌ష్టం చేసింది. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్‌ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని తాజాగా హైకోర్డు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రబ్బరు డ్యాంలోనే నిమజ్జనం చేయాలని సూచించింది. చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని హైకోర్టు హితవు పలికింది.

హుస్సేన్​సాగర్​లో గణేశ్​ నిమజ్జనం చేయవద్దంటూ న్యాయవాది వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్​పై ఇటీవల వాదనలు జరిగాయి. కొవిడ్ నేపథ్యంతో పాటు.. హుస్సేన్ సాగర్ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని గణేశ్ నిమజ్జనం నియంత్రణలపై సూచనలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఏడాది పొడవునా.. వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నారని.. నిమజ్జనం సమయంలో వాటన్నింటినీ తొలగిస్తున్నారని.. దానివల్ల ప్రజాధనం వృథా అవుతోదందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గురువారం హైకోర్టు గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించింది.