ఏపీ ప్రభుత్వని కి హైకోర్టు ఆదేశాలు

క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ను మ‌రింత వేగ‌వంతం చేయండి..హైకోర్టు

అమరావతి: హైకోర్టులో ఈ రోజు క‌రోనా రెండో ద‌శ విజృంభ‌ణ వేళ ఏపీలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు, వ్యాక్సినేష‌న్ వంటి అంశాల‌పై విచార‌ణ కొన‌సాగింది. అలాగే, క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం స‌మ‌ర్థంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని దాఖ‌లైన వ్యాజ్యాల‌ను ప‌రిశీలించింది. ఈ సంద‌ర్భంగా ఏపీలో మూడో ద‌శ క‌రోనా వ్యాప్తి జ‌రిగితే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది.

ఇప్ప‌టికే ఏపీలో 26,325 మంది వైద్య, ఇత‌ర‌ సిబ్బందిని నియ‌మించామ‌ని తెలిపింది. 1300 కి పైగా యాక్టివ్‌ బ్లాక్ ఫంగ‌స్ కేసులు ఉన్నాయ‌ని వివ‌రించింది. అలాగే, మూడో ద‌శ క‌రోనా వ్యాప్తి జ‌రిగితే పిల్ల‌ల‌కు భారీగా సోకుతుంద‌న్న అంచ‌నాలు నిర్ధార‌ణ కాలేద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం స‌మ‌ర్థంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏపీ స‌ర్కారుకి హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని చెప్పింది. ఒప్పంద న‌ర్సుల‌కు బ‌కాయి ఉన్న వేత‌నాలు చెల్లించాల‌ని పేర్కొంది. క‌రోనా వేళ మాన‌సిక రోగుల‌కు ఎలాంటి వైద్య చికిత్సలు అందిస్తున్నార‌ని కోర్టు ప్రశ్నించింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై విచార‌ణ‌ను కోర్టు సోమ‌వారానికి వాయిదా వేసింది.

తాజా తెలంగానా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/