నేడు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక

హైకోర్టు ఆదేశాలతో నేడు నిర్వహణ
వివరాలు ప్రకటించొద్దన్న హైకోర్టు

కొండపల్లి: కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నిక సజావుగా జరిపించాలంటూ టీడీపీ పిటిషన్ వేయడంతో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. ఈ ఉదయం 10.30 గంటలకు ఎన్నిక జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికైన అభ్యర్థులకు రక్షణ కల్పించాలని హైకోర్టు విజయవాడ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. అటు, పిటిషనర్లకు కూడా రక్షణ కల్పించాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఎన్నిక అనంతరం ఫలితాలు ప్రకటించవద్దని, వివరాలు తమకు అందజేయాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కొండపల్లి ఎన్నిక కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ పరిధిలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. ఇందులో టీడీపీకి 15 మంది, వైస్సార్సీపీకి 14 మంది కౌన్సిలర్ల బలం ఉంది. చైర్మన్ ఎన్నిక సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకోనున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్ల అనంతరం టీడీపీ బలం 16కి, వైసీపీ బలం 15కి పెరగనుంది. ఈ నేపథ్యంలో చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. నిన్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ రసాభాస కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందినవారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/