ఎంపీ గోరంట్ల వీడియో ఫై సీబీఐకి ఫిర్యాదు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వైస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం ఫై హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ సీబీఐకి ఫిర్యాదు చేశారు. గోరంట్ల మాధవ్‌ పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో ఒరిజినల్‌ కాదని, ఫేక్‌ అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఇప్పటికే ప్రకటించినప్పటికీ… ఈ వ్యవహారంపై రగడ కొనసాగుతూనే ఉంది. తాజాగా హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఈమెయిల్‌ ద్వారా చెన్నై జాయింట్‌ డైరెక్టర్ కార్యాలయానికి పంపారు. ఫిర్యాదుతో పాటు మాధవ్​కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్‌ను జతపరిచారు. మాధవ్ వ్యాఖ్యల వల్ల రెండు వర్గాల మధ్య విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధవ్​పై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఫేక్‌, మార్ఫింగ్‌ వీడియో అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పడం మహిళా లోకాన్ని విస్మయానికి గురి చేసిందంటూ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు శుక్రవారం లేఖ రాశారు. కోట్లాది మహిళల ఆత్మగౌరవం, భద్రతకు సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నందున ఆ వీడియో క్లిప్‌పై కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి, నిజానిజాలు వెలికితీయాలని అభ్యర్థించారు.