ఇప్పటం గ్రామస్థులకు షాక్ ఇచ్చిన హైకోర్టు

ఇప్పటం గ్రామస్థులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్ట్ ను తప్పుపట్టించారంటూ 14 మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధించింది. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో విచారణ సందర్భంగా తమకు నోటీసులు ఇవ్వలేదని రైతుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాము నోటీసులు ఇచ్చిన తరువాతనే కూల్చేశామని ఇటీవల విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14 మంది రైతులను ఈ రోజు హైకోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇప్పటం గ్రామస్తులు ఈరోజుకు కోర్టుకు హాజరయ్యారు. అయితే తమకు అవగాహన లేదని గ్రామస్థులు చెబుతున్నారు. అయినప్పటికీ వారి వాదనను తిరస్కరించిన హైకోర్ట్… ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించింది.

ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటంలో అక్రమ నిర్మాణాలను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తొలగింపులపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గ్రామంలో నిర్మాణాల తొలగింపునకు సంబంధించి అధికారులు నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని.. తమకు తప్పుడు సమాచారం ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసుకున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలను దాచి స్టే తీసుకున్నందుకు సీరియస్‌గా స్పందించింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదోనని కోర్టు ప్రశ్నించింది. ఇదంతా కచ్చితంగా న్యాయస్థానం ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని వ్యాఖ్యానించింది.