జగన్‌ పై పాత కేసుల ఉపసంహరణను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 11 క్రిమినల్ కేసుల నమోదు

అమరావతి: సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నమోదైన 11 క్రిమినల్ కేసులను నిబంధనలకు విరుద్ధంగా ఉపసంహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు, ఫిర్యాదుదారులు కలిసి నిబంధనలను ఉల్లంఘించి కేసులను ఉపసంహరించడాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ 11 కేసుల్లో అనంతపురం జిల్లాకు సంబంధించినవి ఐదు కాగా, గుంటూరులో నమోదైనవి ఆరు కేసులు ఉన్నాయి. కరోనా సమయంలో పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సంబంధిత న్యాయాధికారులు కలిసి నిబంధనలకు విరుద్ధంగా ఈ కేసులను హడావుడిగా ఉపసంహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులకు సంబంధించిన వివరాలు కోర్టు దృష్టికి రావడంతో హైకోర్టు పరిపాలన విభాగం వీటిని పరిశీలించి సుమోటోగా విచారణకు తీసుకుని హైకోర్టు రిజిస్ట్రీకి నంబర్లు కేటాయించింది. ఈ క్రిమినల్ రివిజన్ పిటిషన్లు నేడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ముందుకు విచారణకు రానున్నాయి. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిర్యాదుదారులు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతివాదులుగా ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/