మా దేశానికి సహాయం చేయండి : ప్రేమదాస

మోడీకి శ్రీలంక ప్రతిపక్ష నేత వినతి

Help our country- Premadasa's request to Modi
Help our country- Premadasa’s request to Modi

Colombo: ప్రస్తుతం శ్రీలంక దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాలకవర్గం రాజీనామా చేయాలంటూ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో ప్రధాని మహింద రాజపక్స మినహా శ్రీలంక కేబినెట్ ఆదివారం అర్థరాత్రి రాజీనామా చేసింది.. మొత్తం 26 మంది మంత్రులు రాజీనామా చేశారని కొత్త విద్యాశాఖ మంత్రి దినేష్ గుణవర్ధనే తెలిపారు. రాష్ట్రపతి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు మంత్రులందరూ తమ రాజీనామా లేఖలను సమర్పించామని వారు వెల్లడించారు. ఈనేపథ్యం లో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ఆయన సోదరుడు మహింద రాజపక్స ప్రభుత్వ భవిష్యత్తుపై సమావేశం కానున్నారు.

ఈ క్రమంలోనే శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే సోదరుడు, ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సేను తొలగించినట్లు అధికారి ఒకరు తెలిపారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స.. ప్రతిపక్షాలను ఐక్య ప్రభుత్వంలో చేరాలని ఆహ్వానించిన కొన్ని గంటల తర్వాత శ్రీలంకలో కొత్త మంత్రులను సైతం నియమించారు.

కొత్త ఆర్థిక మంత్రిగా అలీ సబ్రీ, విద్యా మంత్రిగా దినేష్ గుణవర్దన, హైవేస్ పోర్ట్‌ఫోలియో జాన్‌స్టన్ ఫెర్నాండోకు వెళ్లగా, ప్రొఫెసర్ జిఎల్ పీరిస్ విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు.
కాగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక (CBSL) గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ తన రాజీనామాను సమర్పించారు. క్యాబినెట్ మంత్రులందరూ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

మా దేశానికి సహాయం చేయండి : మోడీకి శ్రీలంక ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస వినతి

సంక్షోభం సమయంలో తమ దేశానికి సహాయం చేయాలని శ్రీలంక ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. దయచేసి శ్రీలంకకు సాధ్యమైనంత వరకు సహాయం చేయండి’ అంటూ ఆయన ప్రాధేయపడ్డారు. ఇది మా మాతృభూమి, మా మాతృభూమిని రక్షించడానికి ఆదుకోండి అంటూ ప్రేమదాస భారత ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/