హిమాలయాల్లో 10వేల అడుగుల ఎత్తులో ‘ఫుట్ బాల్’ మైదానం

లడఖ్ లోని స్పిటుక్ వద్ద భారీ స్టేడియం

ల‌డ‌ఖ్: హిమాలయ పర్వత సానువుల్లో సాధారణ జనవజీవనం ఎంత కష్ట సాధ్యమో తెలియంది కాదు. గడ్డకట్టించే శీతల వాతావరణం జీవుల మనుగడకు సవాలుగా నిలుస్తుంది. అలాంటి చోట ఫుట్ బాల్ మైదానం ఏర్పాటు చేయడం అంటే నిజంగా అచ్చెరువొందించే విషయం. లడఖ్ లోని స్పిటుక్ వద్ద అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఫుట్ బాల్ మైదానాన్ని నిర్మించారు. ఇది భారత్ లోనే అత్యంత ఎత్తయిన సాకర్ మైదానం. ఈ స్టేడియం ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లకు కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు.

ఇది సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రస్తుతం ఈ స్టేడియం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. 30 వేల మంది ప్రేక్షకులు కూర్చునేలా గ్యాలరీలు నిర్మిస్తున్నారు. ఈ స్టేడియం అంచనా వ్యయం రూ.10.68 కోట్లు. అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం ఫిఫా కూడా లడఖ్ ఫుట్ బాల్ మైదానానికి పచ్చజెండా ఊపింది. ఖేలో ఇండియా కార్యాచరణలో భాగంగా మైదానం ఉపరితలాన్ని ఆస్ట్రోటర్ఫ్ తో ఏర్పాటు చేశారు. అంతేకాదు, స్టేడియాన్ని ట్రాక్ ఈవెంట్ల కోసం ఉపయోగించుకునేందుకు వీలుగా 8 లేన్లతో సింథటిక్ ట్రాక్ లను కూడా పొందుపరిచారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/