పట్నం బాట పట్టిన పల్లెవాసులు

సంక్రాంతి సందర్బంగా సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులు మళ్లీ పట్నం బాట పట్టారు. నాలుగు రోజుల పాటు సంక్రాంతి ని ఆనందంగా గడిపిన వారంతా తిరిగి పయనమయ్యారు. దీంతో రోడ్లపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద నిన్న సాయంత్రం నుండే వాహనాల రద్దీ నెలకొంది. ఈ రద్దీని నియంత్రించేందుకు అధికారులు17 బ్లాక్ స్పాట్స్ ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నవాబు పేట నుంచి పెద్దకాపర్తి వరకు ప్రమాద ప్రాంతంగా గుర్తించారు. ఇక గత 2,3 రోజుల నుంచీ బోసిపోయిన హైదరాబాద్ రోడ్లు.. మళ్లీ జనసంద్రంగా మారాయి.

ఇక ఇదిలా ఉంటె సంక్రాంతి వేళ టిఆర్ఎస్ ఆర్టీసీ పట్ల రికార్డు స్థాయిలో ప్రయాణికులు ఆదరణ చూపారు. ఈ నెల 11 నుంచి 14 వరకు 1.21 కోట్ల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. గత సంక్రాంతితో పోల్చితే దాదాపు 5 లక్షలు మంది ఎక్కువగా తమ బస్సుల్లో ప్రయాణించినట్లు ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి తిరుగుప్రయాణానికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ఇతర అంశాలపై అధికారులతో హైదరాబాద్‌ బస్‌ భవన్‌ నుంచి ఆన్‌లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్రాంతికి సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చిన సిబ్బందిని సజ్జనార్ అభినందించారు.