జలదిగ్బంధంలో తిరుపతి ..

అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తిరుపతి నగరం పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయింది. భారీ వర్షాల కారణంగా తిరుమల కనుమ దారిలో కొండచరియలు పడ్డాయి. అప్రమత్తమైన టీటీడీ అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు.. పాపవినాశనం రహదారిని మూసివేసింది. వర్షాలతో రేణిగుంట విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. వర్షాల కారణంగా రేపు విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేకచోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడప జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల కడప నగరమంతా జలమయమైంది. రోడ్లపై మోకాలి లోతు వరకు వరద నీరు నిలిచిపోవటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, భరత్ నగర్, అంబేడ్కర్ కూడలి, భాగ్య నగర్ కాలనీ, గంజికుంట కాలనీ, మృత్యుంజయ కుంట, ప్రకాష్ నగర్, నకాష్ వీధి, శాస్త్రి నగర్, ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం రోడ్డు, కోర్టు రోడ్డు, నీటమునిగాయి. పలు వాగులు, వంకలు, చెరువులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి

ఇదిలా ఉంటే, చెన్నైకి ఆగ్నేయంగా 310 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రేపు తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తుఫాన్ తీరం దాటనుంది. దీంతో కడప, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రెండు జిల్లాలలో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయి. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.