నెల్లూరు జిల్లాలో ఉద్ధృతంగా వరద ప్రవాహం

కండలేరు, సోమశిల నుంచి భారీగా నీటి విడుదల

నెల్లూరు: నెల్లూరు జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. డ్యామ్ లు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. చెరువులు అలుగు పారుతూ రోడ్లపై ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్ల చుట్టూ వరద చేరడంతో ఎప్పుడు కూలుతాయోనని ప్రజలు భయపడే పరిస్థితులున్నాయి. పంబలేరు వరద ప్రవాహంతో ఇవాళ ఉదయం 16వ నంబర్ జాతీయ రహదారిపై గూడూరు–మనుబోలు మధ్య వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జాం అయింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కండలేరు డ్యామ్ నుంచి దిగువకు భారీగా వరద నీటిని విడుదల చేస్తుండడంతో సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు చెరువు నిండిపోయింది. అలుగెత్తి రోడ్డుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

మర్రిపాడు మండలం చుంచులూరు దగ్గర కేత మన్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రెండు రోజులుగా పి.నాయుడుపల్లి, చుంచులూరు గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ రెండు గ్రామాల్లోని చెరువులు పూర్తిస్థాయిలో నిండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాయుడు పేటలో పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇళ్ల చుట్టూ నీళ్లు నిలిచాయి. మేతలేక పశువులు అలమటిస్తున్నట్టు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సోమశిల జలాశయానికి వరద పోటెత్తుతోంది. జలాశయానికి 96,569 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1,15,396 క్యూసెక్కులను గేట్ల ద్వారా వదిలేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 68.37 టీఎంసీల నీళ్లున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/