ఏపీలో దంచికొడుతున్న వర్షాలు..

ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడనంతో పాటూ ఉపరితల ఆవర్తనంతో మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో 48 గంటలు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

శుక్రవారం కురిసిన వర్షం ఫలితంగా వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 72 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అనంతపురం మండలంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. ద్రాక్ష, టమాటా పంటలు దెబ్బతిన్నాయి. గుండ్లకమ్మ రెండు గేట్లు ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఒంగోలు, కనిగిరి, పొదిలి పట్టణాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నాగావళి, వంశధార, బహుదా నదుల్లో నీటి ఉదృతి పెరిగింది. వజ్రపు కొత్తూరు, పొందూరు మండలాల్లో వదరనీరు ఇళ్లలోకి చేరుకుంది. ఇక వర్షాల కారణంగా ఏపీవ్యాప్తంగా నలుగురు మృతి చెందారు.