ఏపీలో దంచి కొడుతున్న వర్షం

holiday-announced-in-chittoor-district-due-to-heavy-rain-forecast

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో జోరు వర్షం కురుస్తుంది. ఉదయం నుండి నెల్లూరు జిల్లాలో భారీ వర్షం పడుతుండడం తో ముందస్తు జాగ్రత్తగా జిల్లా కలెక్టర్ రెండు రోజుల పాటు స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు. గంటగంటకు గాలుల వేగం పెరగడంతో చలి తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. నెల్లూరు నగరంలో లోతట్టు ప్రాంతాలల్లోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంకటగిరి పట్టణంలోని సవారిగుంట,ఎన్టీఆర్ కాలనీ, మార్కెట్ వీధుల్లోని లోతట్టు ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో ఆయా కుటుంబీకులు ఇక్కట్లు పడుతున్నాయి.

అల్పపీడనం కారణంగా జోరు వర్షానికి తిరుమలలో కొండచరియలు విరిగిపడటం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే తిరుమల నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. మొదటి ఘాట్ రోడ్డులోని రెండో మలుపు వద్ద ఘటన జరిగింది. ఫలితంగా ఘాట్ రోడ్ లో భారీ స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

కడప జిల్లాలోను రాత్రి నుంచి చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ తెల్లవారుజాము నుంచి ఓ మోస్తరుగా వర్షం పడుతోంది. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కడప జిల్లా పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. కడప నగరంలో ప్రవహిస్తున్న బుగ్గవంక ఇరువైపులా ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో వాగులు, వంకలు ఉన్నచోట బందోబస్తు ఏర్పాటు చేశారు. కుప్పంలో కుండపోతగా కురుస్తున్న వర్షానికి ప్రచారం అగిపోయింది. ఇక కృష్ణా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తుండగా.. పలుచోట్ల మురుగు కాలువల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.