బెంగళూరును వదలని భారీ వర్షం

బెంగళూరు నగరం తడిసిముద్దవుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో నగరంలో వరద పోటెత్తింది. వందలాది కాలనీలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి బెంగళూరు అస్తవ్యస్తమైంది. ఇక నిన్న ఆదివారం రాత్రి బెంగళూరులో కుండపోతగా వర్షం కురిసింది. సీవీ రామన్ నగరంలో అత్యధికంగా 44 సెంటిమీటర్ల వర్షం కురవగా.. ఇతర ప్రాంతాల్లోనూ 20 నుంచి 30 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఇక ఇప్పుడు సోమవారం రాత్రి సైతం భారీ వర్షం పడుతుంది.

గత రాత్రి కురిసిన వర్షంతో నగరమంతా జలమయం కాగా, ఈ సాయంత్రం కురిసిన వర్షంతో వరద పరిస్థితులు కనిపించాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. దాంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ప్రధాన రహదారులపైనే ఇలా ఉంటే, లోతట్టు ప్రాంతాల్లో మరీ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలను తరలించేందుకు బోట్లను ఉపయోగించాల్సి వస్తోంది. ఇప్పటికే బెంగళూరు నగరంలో విద్యాసంస్థలు మూసివేశారు. భారీ వర్షం ధాటికి ఎయిర్ పోర్టు ప్రయాణికుల లాంజ్ వరకు నీళ్లు వచ్చాయి.

కాగా, భారీ వర్షాలపై కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై స్పందించారు. టీకే హళ్లి పంప్ హౌస్ పొంగడంతో భారీగా వరద నీరు చేరిందని అన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.