హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వర్షం

హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాల చోట్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అలెర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలి, బోరబండ, ఫిలింనగర్, బంజారాహిల్స్‌తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము వరకు వర్షం పడుతూనే ఉంది. ముఖ్యంగా మూసాపేట, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలో నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

తెలంగాణవ్యాప్తంగా ఇప్పటికే వానలు పడుతుండగా.. రానున్న ఐదు రోజుల పాటు కూడా కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు వర్షసూన జారీ చేసింది. నేడు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.