హైదరాబాద్ లో రెండు గంటలుగా దంచి కొడుతున్న వర్షం

హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుండి వర్షం కురుస్తూనే ఉండడంతో ఎక్కడెక్కడి ట్రాఫిక్ నిలిచిపోయింది. సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌ వరకు ఆకాశమంతా మేఘావృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లోని పటాన్‌చెరు, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, అల్వాల్‌, బాలనగర్‌, బేగంపేట, అమీర్‌పేట, మల్కాజ్‌గిరి, కాప్రాతో పాటు పరిసరాల ప్రాంతాల్లో దాదాపు గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అప్ర‌మత్త‌మైంది. డీఆర్ఎఫ్ బృందాల‌ను రంగంలోకి దించింది. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. భారీ వ‌ర్షానికి న‌గ‌రంలోని ప‌లు నాలాలు పొంగిపొర్లాయి. ర‌హ‌దారులు జ‌ల‌మ‌యం అయ్యాయి. ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది. రోడ్ల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అంతేకాకుండా పాఠశాలల నుంచి ఇండ్లకు చేరుకున్న విద్యార్థులు సైతం ఇబ్బందులు పడ్డారు.