హిందూపురంలో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

గత మూడు రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనాలు మధ్య బంగాళాఖాతం, కొమరిన్‌ పరిసరాల్లో వేర్వేరుగా కొనసాగుతున్నాయి. అలాగే కర్ణాటక నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించడం తో ఏపీలోని పలు ప్రాంతాలు భారీగా వర్షం కురుస్తుంది. దీంతో చాల ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.

ఆంధ్ర సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రాంతాల నుంచి పెన్నా నది ఉధృతంగా ప్రవహించడంతో హిందూపురంలోని శ్రీకంఠపురం, కొట్నూరు, చెరువుల వద్ద మరువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓ లారీ వాగు దాటుతూ అదుపుతప్పి మరువ వద్ద ఇరుక్కుపోయింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని లారీని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. చిలమత్తూరు మండలంలో వరద తాకిడికి కొత్తపల్లి వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో హిందూపురం చిలమత్తూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వచ్చే 24 గంటల్లో రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈరోజు నుండి పశ్చిమగోదావరి, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురస్తాయంటున్నారు. శనివారం విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో వానలు ఉంటాయని వాతావరణ శాఖా తెలిపింది.