అకాల వర్షం తో తడిసిన ధాన్యాన్ని చూసి రైతుల ఆవేదన

రైతన్న కు ఎప్పుడు కష్టాలే..పండించిన పంట అమ్మేవరకు నిత్యం ఆందోళనే..కావాల్సిన సమయంలో వర్షాలు పడవు..అమ్మేవేళ గిట్టుబాటు ధర ఉండదు..అన్ని ఉన్నాయి అనుకునే సమయంలో అకాల వర్షాలు రైతన్న లకు కన్నీరు పెట్టిస్తాయి. తాజాగా అదే జరిగింది. బుధువారం ఉదయం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తుండడం తో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఆందోళన చెందుతున్నారు.

ఇక అసలే అంతంత మాత్రంగానే కాసిన మామిడి నేల రాలిపోవడంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీస్తున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. సిద్ధిపేట, జగిత్యాల, మెదక్, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్, హన్మకొండ, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షం పడింది. సిద్ధిపేట జిల్లా హబ్సీపూర్ లో 7.2 సెంటీమీటర్ల భారీ వాన పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ లో వర్షానికి వడ్లు తడవకుండా కవర్ కప్పుతుండగా.. పిడుగుపడటంతో పోచయ్య ( 65 ) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పక్కనే ఉన్న మరో వృద్ధుడికి గాయాలుకాగా.. అతన్ని దుబ్బాక హాస్పిటల్కు తరలించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం మోదీని గూడెం గ్రామంలో పిడుగుపాటుకు గురై పగడాల లింగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు.