హైదరాబాద్ ను వదలని వాన…

heavy-rain-at-in-hyderabad

హైదరాబాద్ నగరాన్ని వాన వదలడం లేదు. గత మూడు రోజులుగా సాయంత్రం కాగానే వర్షం పడుతుంది. సరిగ్గా ఆఫీస్ ల నుండి తమ పని ముగించుకొని ఇంటికి వచ్చే సమయంలో వర్షం పడుతుండడంతో ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కూడా నగరంలోని పలు చోట్ల సాయంత్రం నుండి వర్షం పడుతూనే ఉంది. సాయంత్రం ఆరు గంట‌ల స‌మ‌యంలో ఉరుములు , మెరుపులతో వాన మొదలై, ఓ గంట పాటు దంచి కొట్టింది. దీంతో న‌గ‌ర‌మంతా జ‌ల‌మయ‌మైంది. న‌గ‌ర శివార్ల‌లో కుండ‌పోత వ‌ర్షం కురిసింది. హ‌య‌త్‌న‌గ‌ర్‌, పెద్ద అంబ‌ర్‌పేట్, స‌రూర్‌న‌గ‌ర్, చంపాపేట్, సైదాబాద్, వ‌నస్థ‌లిపురం, ఎల్బీన‌గ‌ర్‌, మ‌న్సూరాబాద్, నాగోల్‌లో భారీ వాన ప‌డింది.

హైద‌రాబాద్ సెంట్ర‌ల్‌లో కూడా భారీ వ‌ర్షం కురిసింది. దీంతో ప‌లు చోట్ల రోడ్ల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.