కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం..కోటి వరకు ఆస్తి నష్టం

కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు కోటి రూపాయిల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. నగరంలోని శ్రీపురం కాలనీలో ఉన్న గోనెసంచుల గోదాములో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గోడౌన్ నుంచి భారీగా మంటలు ఎగసి పడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మూడు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. షార్ట్‌ సర్య్కూట్‌ వల్లే మంటలు చెలరేగాయని చెప్పారు. కాగా, గోదాములో 40 వేల గోనెసంచులు ఉన్నాయని, ప్రమాదంలో అన్నీ కాలిపోయాయని యజమాని వాపోయారు. అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు.