గుడివాడలో భారీగా పోలీసుల మోహరింపు
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వైనం
Heavily deployed police in Gudivada
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నేడు వెళ్లనున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కమిటీ సభ్యులు, మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్రతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు గుడివాడకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు, కొడాలి కన్వెన్షన్ సెంటర్‌కు వైస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. కాసేపట్లో ఎన్టీఆర్ భవన్ నుంచి టీడీపీ కమిటీ సభ్యులు బయలుదేరనున్నారు. గుడివాడలో క్యాసినో కార్యకలాపాలపై తాము పూర్తిస్థాయి నివేదికను టీడీపీ అధిష్ఠానానికి ఇవ్వనున్నట్లు చెప్పారు. గుడివాడలో పోలీసులు, వైస్సార్సీపీ శ్రేణులు, టీడీపీ నేతల హడావుడితో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబ్బుల కోసం వైస్సార్సీపీ నేతలు దిగజారిపోతున్నారని, చివరకు క్యాసినో ఆడించే స్థితికి వచ్చారని ఆయన అన్నారు. వైస్సార్సీపీ అధికార ప్రతినిధిగా డీజీపీ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజ నిర్ధారణ కమిటీ పర్యటనలో గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజల నుంచి వివరాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే క్యాసినో వంటివి జరుగుతోంటే పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు. తమ పర్యటనను ఎవ్వరూ ఆపలేరని కొల్లు రవీంద్ర అన్నారు. గుడివాడలో ఎన్నికల్లోనూ టీడీపీ జెండాను ఎగవేస్తామని కొడాలి నానికి ఈ సందర్భంగా తాము చెబుతున్నామని వ్యాఖ్యానించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇంకా ఎన్నాళ్లు సాగుతాయని ఆయన నిలదీశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/