సీఎం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు : డా. ఎంవీ.రావు

కేసీఆర్ కు యాంజియోగ్రామ్ పరీక్షలు.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన డాక్టర్లు

health-bulletin-of-cm-kcr

హైదరాబాద్: సీఎం కెసిఆర్ స్వల్ప అస్వస్థతతో హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా కేసీఆర్ నీరసంగా ఉన్నారు. అంతేకాదు ఎడమ చేయి, ఎడమ కాలు కూడా లాగుతుండటంతో ఆయన ఆసుపత్రికి వచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు.

యాంజియోగ్రామ్ టెస్టు రిపోర్ట్ నార్మల్ గా ఉందని పరీక్షల అనంతరం వైద్యులు వెల్లడించారు. రక్త నాళాల్లో ఎలాంటి బ్లాక్స్ లేవని వైద్యులు తెలిపారు. రెండు రోజులుగా నీరసంగా ఉందని సీఎం చెప్పారని, దీంతో అన్ని నార్మల్ పరీక్షలు చేశామని వెల్లడించారు. సీటీ స్కాన్ తో పాటు మరికొన్ని పరీక్షలను నిర్వహించామని చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆయనతో పాటు ఆయన భార్య శోభ, కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, అల్లుడు అనిల్, మేనల్లుడు హరీశ్ రావు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. ఆయనకు ప్రతి ఏటా ఫిబ్రవరిలో సాధారణ చెకప్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు సాధారణ పరీక్షలతో పాటు ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలను నిర్వహించామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/