ఆదిత్య హయాంలో హెచ్‌డిఎఫ్‌సి షైనింగ్‌!

పలు విధాలుగా వృద్ధిబాట

ADHITHYA PURI
ADHITHYA PURI

ముంబై: ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు రెండున్నర దశాబ్దాల పాటు ముందుండి నడిపించిన ఆదిత్య పూరీ పదవీ విరమణ చేశారు.

దీంతో కొత్త ఎండి, సిఇఒగా శశిధర్‌ జగదీశన్‌ బాధ్యతలు స్వీకరించారు. పూరీ 1994 సెప్టెంబరులో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎండిగా పదవిని చేపట్టారు.

ఆపై బ్యాంకు పలు విధాలుగా వృద్ధిబాటలో నడిచింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 1995మే 19న బిఎస్‌ఇలో లిస్టయింది.

అప్పట్లో బ్యాంకు ఆస్తులు రూ.3394కోట్లుగా నమోదు కాగా, ప్రస్తుతం రూ.16లక్షల కోట్లకుపైగా విస్తరించాయి. మొత్తం డిపాజిట్లు రూ.642కోట్ల నుంచి రూ.12.29లక్షల కోట్లకు చేరాయి.

ఇదే విధంగా 1995మార్చిలో రూ.98కోట్లుగా ఉన్న రుణాలు 2020 సెప్టెంబరు నాటికి రూ.10.38లక్షల కోట్లకు చేరాయి. పూరీ హయాంలో బ్యాంకు మార్కెట్‌ విలువ రూ.7లక్షల కోటకు చేరింది. వెరసి ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో టాప్‌ ర్యాంకుకు చేరుకుంది.

1997లో బ్యాంకు మార్కెట్‌ విలువ తొలిసారి రూ.1000కోట్లను దాటింది. గత 25 యేళ్లలో బ్యాంకు షేరు రూ.మూడు నుంచి రూ.1200కు చేరింది. అంటే 1995నుంచి ఇప్పటివరకూ 30వేల శాతానికిపైగా రిటర్నులు సాధించింది.

గతంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు రెండుసార్లు షేర్ల ముఖ విలువను విభజించింది. 2011లో రూ.10ముఖ విలువను రూ.2కు, తిరిగి 2019లో రూ.2 నుంచి రూ.1కి షేర్ల విభజన చేపట్టింది.

ప్రస్తుతం బిఎస్‌ఇ డేటా ప్రకారం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ప్రమోటర్ల వాటా ప్రస్తుతం 26.02శాతంగా నమోదైంది. పబ్లిక్‌ వాటా దాదాపు 74శాతానికి చేరింది.

వీటిలో మ్యూచువల్‌ ఫండ్స్‌ 13.95శాతం, ఎల్‌ఐసి 3.79శాతంచొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు 37.43శాతం వాటాను కైవలం చేసుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/