ముగిసిన హెచ్ సిఎ ఎన్నికలు

HCA Elections
HCA Elections

హైద‌రాబాద్‌ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సిఎ) ఎన్నికలు శుక్రవారం ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ప్రశాంతంగా జరిగాయి. 227 ఓట్లు ఉండగా, 224 మంది ఓటు వేశారు. ఎన్నికల ఫలితాలను ఈ సాయంత్రం ఐదు గంటలకు ప్రకటిస్తారు. ఈ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ జరిగింది. భారత మాజీ కెప్టెన్ అజరుద్దీన్, ప్రకాశ్‌చంద్ జైన్, దిలీప్ కుమార్ మధ్య త్రిముఖ పోటీ నెలకొనడంతో ఫలితాలపై ఉత్కంఠత నెలకొంది. ఎలాగైనా హెచ్‌సిఎ అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని అజర్ పట్టుదలతో ఉన్నారు. మాజీ అధ్యక్షుడు వివేక్ మద్దతు ఉన్న జైన్ తానే విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు. టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాతిరి బాబురావు సాగర్ ప్యానెల్ అవినీతి నిర్మూలనే ప్రధాన ఏజెండాగా బరిలోకి దిగింది. ఈ ఎన్నికలో 155 ప్రైవేట్ క్లబ్‌లకు చెందిన ప్రతినిధులతో పాటు 51 ఆయా సంస్థల క్లబ్‌లు, తొమ్మిది జిల్లా క్రికెట్ సంఘాలు, 11 మంది మాజీ క్రికెటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. హెచ్‌సిఎ అధ్య‌క్ష ప‌ద‌వికి అజ‌రుద్దీన్ తీవ్ర పోటీ ఇస్తున్నట్టు ఎన్నికల పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. శివ‌లాల్ యాద‌వ్‌, వెంక‌ట‌ప‌తి రాజు, అర్ష‌ద్ అయూబ్‌, మాజీ ఎంపీ వివేక్‌, మాజీ ఎంపి హ‌న్మంత‌రావు తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/