బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న పథకాలన్నీ ఆపేస్తారు – హరీష్ రావు

బిజెపి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన పథకాలన్నీ ఆపేస్తారని హెచ్చరించారు మంత్రి హరీష్ రావు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రావు,..పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ఫై నిప్పులు చెరిగారు. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన గజ దొంగలకు వేల కోట్లు మాఫీ చేసిన కేంద్రం..పేదల కోసం పథకాలు అమలు చేస్తాం అంటే ఉచితాలు వద్దు అంటోందని విమర్శించారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ఆపేస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు..బీజేపీ రాష్ట్రాల్లో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. అతి త్వరలోనే 57 ఏండ్లు నిండిన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం , అర్హులకు రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.