వ్యవసాయశాఖ అధికారుల తీరుపై మంత్రి హరీశ్​రావు ఆగ్రహం

సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయశాఖ అధికారుల తీరుపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు క్లస్టర్ వారిగా అధికారులను నియమించినా ఎందుకు పనిచేయడం లేదన్నారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. శనివారం సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు మొగుడంపల్లి మండలం మన్నాపూర్‌ రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మొగుడంపల్లి మండలానికి సంబంధించి పంటల సాగు వివరాలు చెప్పాలని అధికారులను ఆయన ప్రశ్నించారు. మంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పటంలో జహీరాబాద్ ఏడీఏ బిక్షపతి, మన్నాపూర్ ఏఈవో తడబడ్డారు. దీంతో అధికారుల తీరుపై హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎంత మేర పంటలు సాగుచేస్తున్నారో తెలియకుండా అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాల పర్యటనకు వచ్చే ముందు అన్నిశాఖల వివరాలను తాను సమగ్రంగా తెలుసుకుంటానని తెలిపారు. మంత్రి వస్తున్నాడని తెలిసినా.. అధికారులకు సమాచారం తెలియకపోవటం సరికాదన్నారు. వ్యవసాయ అధికారుల తీరును ప్రత్యేకంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ శరత్‌ను ఆదేశించారు.

అంతకు ముందు జహీరాబాద్‌లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. గర్భిణీలకు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి, అంగ‌న్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్యరావు, జిల్లా కలెక్టర్ శరత్, ఉమ్మడి జిల్లా డీసీఎం చైర్మన్ శివకుమార్ తదితరులు ఉన్నారు.