అయ్యా మోడీ.. మన్ కీ బాత్ కాదు.. మా కిసాన్ బాత్ వినండి – హరీష్ రావు

అయ్యా ప్రధాని మోడీ.. మన్ కీ బాత్ కాదు.. మా కిసాన్ బాత్ వినండి అంటూ మంత్రి హరీష్ రావు ప్రధానికి మోడీకి సూచించారు. సమాధులు తవ్వాలని ఒకరు, భవనాలు కూలగొడతానని ఇంకొకరు అంటారని, కూలగొట్టే వాళ్లు కావాలా లేదా ప్రగతి పునాదులు వేసేవారు కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు మంత్రి హరీశ్‌ రావు..

నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో వాడవాడనా బీఆర్‌ఎస్‌ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రతినిధుల సభ నిర్వహించారు. ఇందులో భాగంగా సిద్దిపేటలోని రంగనాయకసాగర్ వద్ద బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లినరీలో మంత్రి హరీశ్‌ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో వివిధ అభివృద్ధి అంశాలు, కేంద్రం వివక్షపై 12 తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రగతిని ఢిల్లీలో మెచ్చుకుంటారని, ఇక్కడికి వచ్చిమాత్రం తిడతారని విమర్శించారు. ప్రధాని తప్పులను ఎత్తి చూపితే తిడతారా అని ప్రశ్నించారు. అడిగితే ఈడీలు, ఐటీలు, సీబీఐ లను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

దేశంలో ఎక్కడికిపోయినా అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నారని అన్నారు. కేసీఆర్ ద్వారా తెలంగాణ ఖ్యాతి, గౌరవం పెరుగుతున్నదని వెల్లడించారు. కేసీఆర్‌కు తెలంగాణ మీద ఉండే ప్రేమ.. మోదీకి ఉంటుందా, రాహుల్ గాంధీకి ఉంటుందా అని అన్నారు. సీఎం కేసీఆర్‌ను తిడితే సూర్యుడిపై ఉమ్మి వేసినట్లేనని వ్యాఖ్యానించారు.

దేశంలో అత్యధికంగా వరి సాగవుతున్నది తెలంగాణలోనేనని హరీశ్‌ రావు అన్నారు. రాష్ట్రంలో యాసంగిలోనే 57 లక్షల ఎకరాల్లో వరి పండుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం అందని ఇల్లు లేదని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం మూగ జీవాలకు కూడా గ్రాసం లేని దుస్థితి ఉండేదని.. నేడు ఐదారు రాష్ట్రాలకు తిండిపెట్టే ధాన్యం తెలంగాణ రైతులు పండిస్తున్నారన్నారని చెప్పారు. మన రైతు బంధును కాపీ కొట్టి పీఎం కిసాన్‌ నిధి పేరుతో కేంద్రం అమలు చేస్తున్నదని, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను వేర్వేరు పేర్లతో అమలు చేస్తున్నదని తెలిపారు.

సీఎం కేసీఆర్ అనే ఒక అద్భుత దీపం అట్టడుగున ఉన్న తెలంగాణను అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిపాడని చెప్పారు. నిజాలను కచ్చితంగా మాట్లాడాలని, ప్రచారం చేయాలని లేదంటే అబద్ధాలు రాజ్యమేలుతాయని అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు. ఒకప్పుడు ఎన్నికల నినాదాలు నేడు కళ్ల ముందు నిజాలుగా మారాయన్నారు. అయ్యా మోదీ.. మన్ కీ బాత్ కాదు.. మా కిసాన్ బాత్ వినండని ప్రధాని మోదీకి సూచించారు.