ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోడీ గారు?:మంత్రి హరీష్

హైదరాబాద్ : రాష్ట్ర విభజన సక్రమంగా జరగలేదంటూ పార్లమెంట్ లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోయినా, కాంగ్రెస్ తో పాటు అనేక ప్రతిపక్షాలు, బీజేపీ మిత్ర పక్షాలు కూడా వ్యతిరేకించినప్పటికీ, ప్రతి పక్షాలు డివిజన్ ఆడిగినప్పటికీ, మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులు పాస్ అయినట్టు రాజ్యసభలో ప్రకటించుకోవడం సక్రమమా? ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోడీ గారు? అని హరీష్ రావు ప్రశ్నించారు.

‘’పాలక, ప్రతిపక్షాలతో పాటు 33 పార్టీలు సమర్ధించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు అక్రమమా..? 4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేయడం ఏం పద్దతి మోడీ గారు? రైతు‌ వర్గం‌ అంతా తీవ్రంగా వ్యతిరేకించినా మీరు వ్యవసాయ బిల్లులు తేవడం న్యాయమా..? ప్రాణాలకు తెగించి సీఎం కేసీఆర్ గారు చేసిన పోరాటం,వందలాది ఉద్యమకారుల ప్రాణత్యాగం ఫలితంగా. తెలంగాణ ప్రజల‌ ఆకాంక్ష‌ అయిన ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడం అన్యాయమా.. ఇదెక్కడి‌ న్యాయం మోడీ జీ..‘’ అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/