ఆసక్తికర శిక్ష వేసిన బిసిసిఐ

ముంబై: కాఫీ విత్ కరణ్ టివి షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, అపహాస్యం పాలైన టిమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలకు బిసిసిఐ అంబుడ్స్‌మెన్ ఆసక్తికర శిక్ష వేసింది. కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున విధుల్లో అమరులైన పది మంది పారామిలిటరీ కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఇవ్వాలని ఆదేశించింది. అంతేగాక అంధుల క్రికెట్ సంఘానికి పది లక్షలరూపాయలు నిధులు సమీకరించాలని తెలిపింది. ఈ రెండింటినీ చెల్లించటానికి వీరికి నాలుగు వారాల పాటు అంటే నెల రోజుల గడువు విధించిన అంబుడ్స్‌మన్ ఒక వేళ గడువులోగా నిధుల సమీకరణ పూర్తికాకపోతే మ్యాచ్ ఫీజులో నుంచి మినహాయింపు ఉంటుందని హెచ్చరించింది.
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డికె జైన్, బిసిసిఐ అంబుడ్స్‌మెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రికెటర్ల అంశంపై శనివారం తుది తీర్పు ఇచ్చిన అంబుడ్స్‌మెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువతకు ఆదర్శంగా నిలవాల్సిన క్రికెటర్లు హోదాకు తగ్గట్లుగా వ్యవహరించాలన్నారు.బిసిసిఐ రూల్స్ 41/1/c ప్రకారం ఆటగాడు క్రమశిక్షణారాహిత్యం, నిబంధనలు ఉల్లంఘించడం, తప్పుగా వ్యవహరించడంగా వారి చర్యలను పరిగణించి ఈ శిక్షలు విధించామన్నారు.
తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/