వృద్ధాప్యంలోనూ ఆనందంగా.

OLDAGE-
OLDAGE-

వృద్ధాప్యంలోనూ ఆనందంగా.

తన ఆయుర్దాయం ఎంత అన్నది ఏ వ్యక్తికి తెలియదు. అయితే బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బ్రతకాలని, ఎవరిచేత చేయించుకోకుండా సాధ్యమైనంత ఎక్కువ కాలం బ్రతకాలనేఆశ ప్రతి వ్యక్తికీ ఉంటుంది అందుకే పెద్దలు దీవించేటప్పుడు ‘దీర్ఘాయుష్మాన్‌ భవ అని దీవిస్తుంటారు అదే సమయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తనువు చాలించాలని మాత్రం ప్రతి వ్యక్తి కోరుకుంటాడు.

ఇది అందరికీ సాధ్యపడుతుందా అంటే సమాధానం మన దగ్గర ఉండదు. అయినా మనిషి ఆశా జీవి కనుక, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి మనిషీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆధునిక వైద్య విజ్ఞారరం యొక్క ప్రభావం, ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగటం తదితర కారణాల వలన పలు దేశాలలో ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగింది దానితో పాటు వృద్ధుల శాతం కూడా గణనీయంగా పెరిగింది. ఒకానొక నివేదిక ప్రకారం ప్రసుత చైనా జనాభా 120 కోట్లలో మూడువంతుల పైగా 60 సంవత్సరాలు దాటినవారే. అదే సమయంలో ఆహారమే అధ్బుతమైన, అన్నింటికన్న శక్తివంతమైన మందు అని అన్ని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 50-60సంవత్సరాల వయసు దాటినవారు. ఆరోగ్యంగా ఉంటూ ఆయుర్దాయం పెంచుకోవటానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో సంక్లిష్టంగా తెలుసుకుందాం. వయసుపై బడే కొద్దీ జీవక్రియ మందగిస్తుంది. ఆకలి మందగిస్తుంది. జీర్ణక్రియ సరిగా ఉండదు. శక్తి క్రమేపీ క్షీణించటం ప్రారంభిస్తుంది. క్రొత్త కణాల ఉత్పత్తి వేగం తగ్గి ఉన్న కణాలు శిథిలం కావటం వేగవంతమవుతుంది, రోగ నిరోధక శక్తి మందగించటంతో అప్పటివరకు అణిగి ఉన్న వ్యాధులు, వంశపారంపర్య దీర్ఘవ్యాధులు మెల్ల మెల్లగా బయటపడుతుంటాయి. ఇటువంటి పరిస్థితులలో వృద్ధులు తమ జీవన శైలిని, ఆహార నియమాలను మార్చుకోవలసి ఉంటుంది. ఆ క్రమంలో – వృద్ధుల ఆహారం వయసు మీద పడటంతో దాహం వేయదు. అయినా క్రమం తప్పకుండా ప్రతి రోజు కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీరు తీసుకోవాలి. ఇందువలన పోషకాలన్నీ శరీరంలోని అన్ని భాగాలకు చేరుతాయి.

శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా నిలకడగా ఉంచబడుతుంది. త్వరగా జీర్ణమయ్యే బలవర్ధకమైన ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలి. ఎముకలు ధృడంగా ఉండాలి. గనుక సాధారణం కన్న ఎక్కువగా సున్నం అవసరమవుతుంది.ఆ సున్నం శరీరానికి వంట బట్టాలంటే విటమిన్‌ -డి, సున్నం పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను కొరతలేకుండా తీసుకోవాలి. వృద్ధాప్యంలో రోగ నిరోధక శక్తి తగ్గకుండా తగు జాగ్రత్త వహించాలి. రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి ఒక్క ‘జింక్‌ లోహానికి ఉన్నది (హోమియోపతిలో జింక్‌ మెటాలికం) అందువలన, జింక్‌ లోహం ఎక్కువగా ఉండే పదార్థాలను ఎంపిక తీసుకోవాలి. నాడీ వ్యవస్థ సక్రమంగా ఉండటానికి, ఎర్రకణాల ఉత్పత్తికి విటమిన్‌ ‘ బి – 12 అవసరం. కనుక ఆ విటమిన్‌ పుష్కలంగా ఉండే ఆహారం అవసరం. వాటితో పాటు మలబద్దకాన్ని నివారించే పీచు పదార్థాలతో కూడిన ఆహారాన్ని, ఇంకా ఫోలిక్‌ ఆసిడ్‌, విటమిన్‌-‘బి సమృద్దిగా ఉండే ఆహారము కావలసి ఉంటుంది. పైన ఉదాహరించబడిననన్నీ సమపాళ్ళలో ఉండే సమీకృత ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం కొంచెం కష్టతరమే అయినప్పటికి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కనుక కొంచెం కష్టపడాలి.

ఆక్రమంతో విభిన్న రంగులలో లభించే ప్రకాశవంతమైన రంగులలో ఉండే పండ్లు, ఫలాలను ఎంచుకోవాలి. ఆహారాన్ని కొద్ది మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఒంటరితనాన్ని దూరం చేసుకుంటూ నలుగురితో కలిసి భోజనం షాపింగ్‌ చేయటం అలవాటు చేసుకోవాలి. ఇష్టమైన వినోదంతో (సినిమాలు కావచ్చు, సంగీతం కావచ్చు, స్నేహితుల కబుర్లు కావచ్చు, విహార యాత్రలు కావచ్చు) కాలక్షేపం చేయవచ్చు. ఈ విధంగా ఆహార విధి విధానాలతో బాటు జీవనశైలిని కూడ మార్చుకుంటే వృద్ధాప్యం కూడా ఆనందమయంమవుతుంది. ఆరోగ్యంగా, ఆనందంగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించవచ్చు.