తెలంగాణలో పలు చోట్ల వడగండ్ల వర్షం

గురువారం తెలంగాణ లోని పలుచోట్ల వడగండ్ల వర్షం పడింది. గత కొద్దీ రోజులుగా పెరుగుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫిబ్రవరి నెల నుండే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు ఇప్పుడే ఇలా ఉంటె ఏప్రిల్ , మే నెలలో ఇంకెలా ఉంటాయో అని ఖంగారుపడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. మార్చి 16 నుండి తెలంగాణ లోని పలు జిల్లాలో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. చత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఆవరించింది. దీనికి తోడు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణలోకి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

వాతావరణ శాఖ చెప్పినట్లే నిన్నటి నుండి వాతావరణం చల్లబడింది. ఈరోజు పలుచోట్ల వడగండ్ల వర్షం పడింది. వికారాబాద్, సంగారెడ్డి, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. చేవెళ్ల నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. సంగారెడ్డి జిల్లాలో కోహిర్ మండలం బడంపేట్, మనియార్ పల్లిలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. 5 రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది.