జ్ఞానవాపీ మసీదు కేసుపై వారణాసి కోర్టు సంచలన తీర్పు

జ్ఞానవాపీ మసీదు కేసుపై వారణాసి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మసీదులోని దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించేలా ఆదేశించాలన్న హిందూ పక్షం పిటిషన్‌ను సమర్థించింది. దీంతో సెప్టెంబరు 22 నుంచి ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. ఇదే సమయంలో అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. జ్ఞాన్వాపి మసీదులో శివలింగం ఉందని, ఆ శివలింగానికి పూజలు చేయడానికి అనుమతి కల్పించాలంటూ హిందూ విశ్వాసులు కొందరు కోర్టును ఆశ్రయించారు.

దేశవ్యాప్తంగా ఈ అంశం దుమారం లేపింది. హిందూ-ముస్లిం వాదప్రతివాదనల నడుమ మసీదుపై సర్వే చేపట్టడానికి కోర్టు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‭ను పరిశీలించిన అనంతరం వారణాసి కోర్టు తీర్పు వెలువరించింది. హిందూ పక్షాల తరఫున లాయర్ విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ.. ముస్లిం పక్షం పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిందని తెలిపారు. దేవతా విగ్రహాల నిత్య పూజలకు అనుమతించాలన్న దావా నిర్వహించదగినదని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే విశ్వేశ్ పేర్కొన్నారని చెప్పారు.