నిధులు లేకుండా విధులు ఎలా? : జీవీఎల్

కొత్త జిల్లాల ఏర్పాటు అసంబద్ధంగా జరిగింది: జీవీఎల్ అభ్యంత‌రాలు


అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామ‌ని చెప్పారు. అయితే, కొత్త జిల్లాలను వసతులు, సదుపాయాలు లేకుండా ఏర్పాటు చేస్తే ఎలాగ‌ని ఆయ‌న నిల‌దీశారు. అమరావతి తరహాలో కొత్త జిల్లాలను చేయకూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు. అలాగే, అమరావతి అభివృద్ధికి నిధులివ్వాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఎందుకు అడగడంలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు చేస్తామని తాము 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నామ‌ని ఆయ‌న చెప్పారు. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అసంబద్ధంగా జరిగిందని అన్నారు.

నిధులు లేకుండా ఈ కొత్త జిల్లాల్లో విధులు ఎలా నిర్వ‌హిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఒక్కో జిల్లాకు కనీసం రూ.100 కోట్ల నిధులను ఎందుకు కేటాయించ‌లేద‌ని ఆయ‌న నిల‌దీశారు. ఏపీ స‌ర్కారు కొత్త జిల్లాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జిల్లాల పరిస్థితి నిర్వీర్యం అవుతుందని ఆయ‌న చెప్పారు. మౌలిక‌ వసతులు ఏర్పాట్లు చేయకుండా కొత్త జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తారని ఆయ‌న నిల‌దీశారు. జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు కనెక్టివిటీ పెంచాలని ఆయ‌న అన్నారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన‌ ఆదేశాలను ధిక్కరించేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆయ‌న అన్నారు. అమరావతికి నిధులు ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/