గురువు

ఆధ్యాత్మిక చింతన

Guruvu
Guruvu

గురుబోధన శిష్యుడు శిరోధార్యంగా భావించాలి. గురువు చేసే బోధనలు అమృతప్రాయమై శిష్యుని జీవనయానంలో ఉతన్న పథానికి చేర్చే సోపాలుగా ఉపకరిస్తాయి.

విద్యార్జన చేసే సమయంలో ఆచార్యుని పలుకులు కొన్ని సందర్భాల్లో కటువ్ఞగా కనిపించినా అకళంకమైనా ఆయన బోధనాసారం మాత్రం నవ్యనవనీత సమానమై అలరారుతుంది.

గురువు శిష్యుడికి ఎప్పుడూ సన్మార్గానే ప్రబోధిస్తాడు.

హితకరమైన పనులనే చేయమని సమాజానికి నేను సైతం అన్న చందాన ఎంతో కొంత ఉపయోగపడమని ఉద్బోధింస్తాడు.

ప్రాచీన కాలంలో గురు శుశ్రూష చేస్తూ శిష్యులు ఆశ్రమాల్లో విద్యను ఆర్జించిన విధానానికి, నేడు అధునాతన పద్ధతుల్లో సాగుతున్న గురుబోధన పద్ధతులకు ఎంతో వ్యత్యాసం ఉన్నా ఆచార్యదేవుని అంతిమ లక్ష్యం ఒక్కటే.

తన దగ్గర విద్యను ఆశించి సన్నిధికి వచ్చిన శిషుయడికి విజ్ఞాన గరిమను ప్రసాదించే విషయ బోధ చేస్తాడు గురువు.

ఉన్నత విద్యతో పాటు సాంఘిక జీవన సౌందర్యానికి మెరుగులద్దే అమూల్యమైన నైతిక విలువల్ని గురువ్ఞ శిష్యునికి చిన్న నాటనే బోధిస్తాడు.

కొంతమంది గురువులు జీవితానికి అవసరమైన విషయాలపై అవగాహన ఏర్పరిస్తే కొందరు గురువు లు ఆధ్యాత్మికమైన విషయాలను కరతలామలకం చేస్తారు.

ఆదిశంకరులు శ్రీమద్రామానుజాచార్యులు మహ్మద్‌ ప్రవక్త, జీసస్‌ క్రీస్తు వంటి ఆధ్యాత్మిక గురువులు తమ తమ సైద్ధాంతిక విశ్లేషణలో మతానికి ఆత్మకు అనుసంధానమైన అంతర్యామి గురించి కొత్త విషయాలు తమను ఎల్లవేళలా అనుసరించి ఉండే శిష్యులకే కాక జగతిలోని జనులందరికి తేటతెల్లం చేశారు.

ఈ భక్తి మార్గ ప్రబోధకులు మహత్తరమైన ముక్తి మార్గాన్ని చూపిన స్తవనీయ చరితులు.

అరిస్టాటిల్‌, ప్లేటో వంటి తత్వనీతిజ్ఞ్ఞులు మానవజీవన వికాసానికి అనుగుణమైన కమనీయ బోధనలతో కొంగొత్త ఆవిష్కరణలతో వినూత్న బాటలు వేశారు.

ఎన్నో విషయాలను ఆవిష్కరించే విద్యాబోధనలతో పాటు జీవనగమ్యానికి అత్యంత ఆవశ్యకమైన క్రమశిక్షణను అనువణువునా రంగరించి శిష్యుడు జీవితంలో ఉన్నత సోపానాలు అధిరోహియించడానికి ప్రధాన కారణంగా నిలిచే విమల యశస్కుడు గురువు.

గురువు శిష్యులందరికీ ఒకేవిధమైన విద్యను బోధించినా వారిలోని ప్రత్యేకమైన ఆసక్తినీ, అనురక్తిని గ్రహించి విలక్షణమైన రీతిలో ఆ శిష్యుడిని తీర్చిదిద్దటం మనకు పురాణ కాలం నుంచి ద్యోతకమవుతున్నది.

రాజులకు ముఖ్యమైన యుద్ధవిద్య రణతంత్రం, మహాభారతంలో కౌరవపాండవ్ఞలకు రాజగురువ్ఞగా ద్రోణాచార్యుడు తన అద్వితీయ బోధనాపటిమతో ప్రత్యేక్ష శిక్షణా సరళితో సాక్షాత్కరిస్తాడు.

భీమ, దుర్యోధనులకు గదాయుద్ధాన్ని అర్జునుడికి విలువిద్యను, నకుల సహదేవులకు అశ్వవిద్యను ఇలా గురువులైన ద్రోణుడు వారి వారి అభిరుచిని బట్టి వారి భువనైక ప్రతిభకు పదును పెట్టడం సాధృతంగా ద్యోతకమవుతుంది.

గురువు దివ్య వాక్కుల ప్రాభవాన్ని శిష్యుడిపై ఆయన చూపలిగే అగణిత ప్రభావాన్ని ఎంత చెప్పుకొన్నా తక్కువే.

ఈ ధరిత్రిపై జన్మించటానికి తల్లిదండ్రులు కారకులైతే, గురువు ప్రజ్వలించే జ్ఞాన ప్రేరకుడు. గురువు వికాసధాత. ప్రగతికి శ్రేయానికి మూలభూతిగా నిలిచే లోకకళ్యాణ ప్రధాత.

విశాలవిశ్వానికి తిమిరాన్ని దూరంచేసి వెలుగులు ప్రసాదించేది నింగిలోని వే వెలుగుల భానుడైతే శిష్యుడి అజ్ఞానమనే తమస్సును తొలగించి విజ్ఞానజ్యోతులతో ప్రకాశింపచేసే జ్ఞాన సూర్యుడు ఈ భువిలోని ఆచార్యుడు గురువు.

  • ఉలాపు బాలకేశవులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/