మాస్క్ లేదని ట్రాఫిక్‌ సిఐ కి ఫైన్ విధించిన గుంటూరు అర్బన్ ఎస్పీ

కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచన

Guntur Urban SP Ammireddy wearing a mask after imposing a fine on Tulluru Traffic CI
Guntur Urban SP Ammireddy wearing a mask after imposing a fine on Tulluru Traffic CI

Guntur: రోడ్డుపై మాస్క్ ధరించకుండా వెళుతున్న తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ కి గుంటూరు అర్బన్ ఎస్పీ ఫైన్ విధించిన సంఘటన గుంటూరు సిటీలో మంగళవారం చోటుచేసుకుంది. గుంటూరు అర్బన్‌ పరిధిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. లాడ్జికూడలి, ఎంటీబీ కూడలిలో స్పెషల్‌ డ్రైవ్‌లో ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు.

లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడం ఎస్పీ గుర్తించారు. వెంటనే సీఐని ఆగమన్నారు. తన దగ్గరికి పిలిచి మాస్కు ఎందుకు ధరించలేదని సీఐని ప్రశ్నించారు. అత్యవసరంగా విధుల్లో హాజరవ్వడానికి వెళుతూ మర్చిపోయినట్లు సీఐ సమాధానమిచ్చారు. సీఐ సమాధానంతో ఎస్పీ సంతృప్తి చెందలేదు. కరోనా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. మాస్కు ధరించని కారణంగా సీఐకి అపరాధ రుసుం విధించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఎస్పీ మాస్కు తెప్పించి స్వయంగా సీఐకి ధరింపజేశారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/