గుంటూరు జిజిహెచ్‌ : సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం..

Guntur GGH
Guntur GGH

గుంటూరు: పేదల పెద్దాసుపత్రిగా పేరుగాంచిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో అనేక సమస్యలు తిష్టవేశాయ. ఎంతో ఘన చరిత్రతో నవ్యాంధ్ర రాజధానిలో 5 జిల్లాల ప్రజలకు ఆరోగ్య ప్రధాయినిగా నిలిచిన ఇక్కడ పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాశీన వైఖరితో ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందటం లేదు.మౌలిక వసతులు లేమి స్పష్టంగా కన్పిస్తోంది. ఆసుపత్రిలో ఎప్పటినుండో అపరిషృతంగా వున్న అనేక సమస్యలకు ఎపి ప్రభుత్వం పరిష్కారమార్గం చూపి పేదలకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని ప్రజానీకం కోరుతోంది.

క్యాజువాలిటీ విభాగం అంటేనే భయం:

జి.జి.హెచ్‌.లో అత్యవసర వైద్య విభాగం (క్యాజువాలిటీ) పేరు చెబితే రోగుల గుండెల్లో దడ మొదలవుతుంది. అత్యవసర సమయాల్లో, ప్రాణాపాయ స్ధితిలో ఆసుపత్రికి వచ్చే రోగులకు క్యాజువాలిటీ నరకప్రాయంగా మారింది. పేరుకే ఎమర్జెన్సీ వార్డు అయితే 24గంటలు సేవలు అందిచాల్సిన వైద్యులు, సిబ్బంది అందుబాటులో వుండరనేది అందరికీ తెలిసిందే.

గుంటూరు జిజిహెచ్‌ : సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం..
రోగిని క్యాజువాలిటీకి మోసుకెళుతున్న బంధువులు

ప్రమాదాల బారిన పడ్డవారిని 108 వాహనాల్లో ఆగమేఘాలపై ఆసుపత్రికి తరలించిన వారికి అత్యవసర వైద్యం లభించదనే జగమెరిగిన సత్యం. ఆసుపత్రి మెట్ల వద్దనుంచి స్ట్రక్చర్‌ మొదలుకొని వీల్‌ ఛైర్స్‌, వార్డు బా§్‌ులు అందుబాటులో ఉండరని చెప్పటంలో ఆశ్చర్యం లేదు. అదృష్టవశాత్తు స్ట్రక్చర్‌ దొరికినా రోగుల సహాయకులే స్ట్రక్చర్‌ని తోసుకు వెళ్ళాల్సిందే . వార్డులో ఆయాలే, సిబ్బంది, వార్డు బా§్‌ు్స కనుచూపు మేర కనపడర.ు ఒక వేళ ఎవరైనా దర్శనమిచ్చినవారికి ముడుపులు చెల్లించుకోవాల్సిందే.
క్యాజువాలిటీకి వచ్చే రోగుల సంఖ్యకు తగ్గట్లుగా సదుపాయాలు లేవు. నెలలు తరబడి ఆ విభాగంలో ఎ.సి. మిషన్లు పనిచేయడంలేదు. అయిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ వాటి మరమ్మతులు చేయించేదుకు శ్రద్ధ చూపటం లేదు. క్యాజువాలిటీలో వున్న జబ్బులు పొగొట్టుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళితే ఇతరుల నుండి సొకే ఇన్ఫెక్షన్ల కారణంగా కొత్త జబ్బులతో బయటికి వెళ్ళాల్సిన దుర్భరపరిస్ధితులు నెలకొన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం కారణంగా కింది స్ధాయి సిబ్బందిలో జవాబుదారీతనం లోపించి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు.

పదేళ్లుగా భర్తీకాని సివిల్‌ సర్జన్‌ ఎడ్మినిస్ట్రేటర్‌ పోస్టు

ఆసుపత్రి పరిపాలనలో ఎంతో కీలకమైన సివిల్‌ సర్జన్‌ ఎడ్మినిస్ట్రేటర్‌ పోస్టు గత 10ఏళ్ళుగా ఖాళీగా వుంది.ఆసుపత్రికి వచ్చే రోగులకు మొరుగైన సేవలు లభించడం లేదు. కీలకమైన పోస్టును భర్తీ చేయకుండా ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు మీనవేషాలు లెక్కిస్తున్నారు ఎంతో బాధ్యతగల పోస్టు భర్తీ చేయకుండా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీని పర్యవసానంగా అత్యవసర వైద్యం కోసం అసుపత్రికి వచ్చిన రోగులు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు.

మోకీలు మార్పిటి ఆపరేషన్లు పునరుద్ధరించాలి

రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా జి.జి.హెచ్‌.లో రూ.లక్షలు ఖరీదు చేసే మోకీలు మార్పిడి ఆపరేషన్లు 100కు దాకా ఉచితంగా నిర్వహించారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 65 లక్షల నిధులతో వంద మంది పేద రోగులకు ఆసుపత్రిలో మోకీలు మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా జరిగాయి. నిధులు మంజూరు చేయకపోవటంతో మోకీలు మార్పిడి ఆపరేషన్ల కోసం తమ పేర్లు నమోదు చేసుకున్న 500 మంది రోగులు ఆపరేషన్ల కోసం ఎదురు చూడాల్సిన అగత్యం ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా నిధులు మంజూరు చేసి జి.జి.హెచ్‌.లో ఉచిత మోకీలు ఆపరేషన్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకొంటున్నారు.

Guntur GGH
క్యాజువాలిటీ వద్ద కన్పించని చక్రాల బళ్లు

వైద్యుల వేతనాలు పెంచరూ

వైద్య విద్య పూర్తిచేసిపేదలకు సేవ చేయాలనే తలంపుతో జిజిహెచ్‌లో వైద్యులుగా చేరిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల కంటే తక్కువగా వేతనాలతో పనిచేయాల్సి వస్తోందని ఇక్కడి వైద్యులు వాపోతున్నారు. 2006లో దివంగత సిఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో పెంచిన జీతాల తర్వాత నేటి వరకు తమ జీతాల పెంపుపై ఆలోచన చేసిన వారు లేరని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2006 తరువాత యు.జి.సి. విడుదల చేసిన పిఆర్‌సి బకాయిలను ఇప్పటి వరకు తాము పొందలేదని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు గత 4ఏళ్ళ నుండి నిర్వహించలేదని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.

not working AC's
క్యాజువాలిటీలో అలంకారప్రాయంగా ఉన్న ఎసిలు

మరమ్మతులకు నోచుకోని పరికరాలు:

వైద్య సేవలు అందించటానికి అవసరమైన వైద్య పరికరాలు తరచు మరమ్మతులకు గురవుతున్నాయి. వివిధ వార్డుల్లో వెంటిలేటర్లు అనేకం పనిచేయక పోవటంతో కొంత మంది రోగులు ప్రాణాలు కోల్పోక తప్పటం లేదు. ఆసుపత్రిలో అవసరమైన మందులు అందుబాటులో లేకపోవటంతో వైద్యులు వాటికోసం రోగులను బయటికి పంపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆసుపత్రిలో ఔషధాల కొరత నివారించి అన్ని రకాల మందులు నిత్యం అందుబాటులో వుండే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకొంటున్నారు. ఆసుపత్రిలో కాంట్రాక్టు సెక్యురిటీ సిబ్బంది గత 5 నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. ఈ అంశాన్ని పలుమార్లు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా తాత్కాలిక పరిష్కారం మాత్రమే మినహా శాశ్వత పరిష్కారం లభించటం లేదు. ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్టు సెక్యురిటీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో తమకు అవకాశం కల్పించి తమను ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా పరిగణించి తమ వేతనాల పెంపునకు తోడ్పడాలని వారు కోరుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/