పులిచింతల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపు గ్రామాలలో కలెక్టర్ పర్యటన

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు

Guntur District collector Anand kumar
Guntur District collector Anand kumar

Guntur: కృష్ణా నది వరద నీటి వలన ముంపునకు గురయ్యే గ్రామాలలోని ప్రజలను ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించి, సౌకర్యాలు
కల్పించాలని జిల్లా కలెక్టర్ ఐ. శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు.

శనివారం మాచవరం మండలంలోని పులిచింతల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపు గ్రామాలైన వేమవరం, రేగులగడ్డ, వెల్లంపల్లి గ్రామాలలో జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ పర్యటించారు.

వేమవరం గ్రామంలో ఎద్దువాగు నీటి ప్రవాహాన్ని, గ్రామంలో వరద నీరు వచ్చే ప్రాంతాలను, రేగులగడ్డ గ్రామంలో వచ్చిన వరద నీటిని, వెల్లంపల్లి గ్రామంలో రహదారిపైకి చేరుకున్న వరద నీటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

గతంలో వరద నీరు గ్రామాలలోకి ఎంతవరకు వచ్చింది అని రెవిన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి వరద నీరు భారీగా దిగువకు వదులుతున్నందున ముంపు గ్రామాలలోకి వేగంగా వరద నీరు చేరుతుందన్నారు.

ముంపు గ్రామాల నుండి కృష్ణా నదిలోకి వెళ్ళే ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.

నదిలోస్నానం చేయడం గాని, చేపలు పట్టడం గాని, పశువులను తీసుకువెళ్ళడం గాని చేయరాదని హెచ్చరిక బోర్డులలో వ్రాయాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ కృష్ణ నదికి వస్తున్న వరద నీటి వలన పులిచింతల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో ఉన్న ముంపు గ్రామాలలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందన్నారు.

వరద నీరు వలన మునిగిపోయే అవకాశం ఉన్న గ్రామాల పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు సహాయక చర్యలపై సూచనలు అందజేసామన్నారు

ముంపుగ్రామాల ప్రజలందరిని ఇప్పటికే ఖాళీ చేయించడం జరిగిందని, వరద నీరు వచ్చే అవకాశం వున్న ప్రాంతాలలో ప్రజలు ఎవరిని ఉంచకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవిన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసామన్నారు.

వరద నీటి ప్రభావిత ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పకడ్బంధీగా తీసుకోవడం జరిగిందన్నారు.

తొలుత జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ పల్నాడు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాల కోసం బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద స్థలాన్ని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో గురజాల రెవిన్యూ డివిజనల్ అధికారి పార్ధసారధి, మాచవరం తహశీల్దారు లేవి, పిడుగురాళ్ళ తహశీల్దారు భాస్కర రావు, రెవిన్యూ, పొలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/