అమెరికాలోని వాల్ మార్ట్ లో కాల్పులు..14 మంది మృతి

అమెరికాలోని వర్జీనియాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. చీసాపీక్ లో వాల్ మార్ట్ మేనేజర్ సహోద్యోగులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ స్టోర్ లో పనిచేస్తున్న 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలు అయ్యాయి. ఇక క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ కాల్పులు జరిపిన వాల్‌ మార్ట్‌ స్టోర్‌ మేనేజర్‌ను కాల్చి చంపారు పోలీసులు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాల్పుల నేపథ్యంలో చీసాపీక్ లోని సామ్ సర్కిల్‌ లో ఉన్న వాల్‌మార్ట్‌ దగ్గర భయానక వాతావరణం నెలకొంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించేందుకు పెద్ద సంఖ్యలో అంబులెన్స్ లు అక్కడికి చేరుకున్నాయి. కాల్పులు ఘటన జరిగిన సమయంలో వాల్‌మార్ట్‌ తెరిచే ఉందని యూఎస్ పోలీసులు తెలిపారు. వాల్‌మార్ట్‌ స్టోర్‌ దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు.. మృతులను గుర్తించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనలో 16 మందికి గాయాలయ్యాయని, అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.