టీడీపీకి మరో షాక్..సీనియర్ నేత రాజీనామా

ఏపీలో తెలుగుదేశం పార్టీ కి వరుస షాకులు తప్పడం లేదు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన ఓటమి చవిచూస్తుండగా..మరోపక్క ఇంతకాలం పార్టీనే నమ్ముకున్న సీనియర్ నేతలు వరుస పెట్టి రాజీనామాలు చేస్తూ చంద్రబాబు కు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. ఇప్పటికే ఎంతమంది సీనియర్ నేతలు రాజీనామాలు చేసి వేరే పార్టీలలో చేరగా…తాజాగా సీనియర్ నేత మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ పార్టీకి రాజీనామా చేసింది.

ఆమె కుమారుడు, టీడీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గ బాధ్యుడు హరికృష్ణ కూడా పార్టీకి, నియోజకవర్గ బాధ్యుడి పదవికి రాజీనామా చేశారు. తమకు వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. టీడీపీ తమను ఎంతగానో గౌరవించిందన్నారు. అనారోగ్యం కారణంగా ప్రజల్లో తిరగలేకపోతున్నామని, పార్టీకి న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.

గుమ్మడి కుతూహలమ్మ 1979లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేసింది. ఆమె 1980 – 1985 సమయంలో చిత్తూరు జిల్లా జెడ్పి చైర్ పర్సన్ గా, కో- ఆప్షన్ సభ్యురాలిగా పని చేసింది. ఆమె 1985లో వేపంజేరి నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరింది. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయింది.