గుజరాత్ ఓట్ల లెక్కింపు : ముందంజలో కమలం

గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి , కాంగ్రెస్ పార్టీ లు నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతుండగా, గుజరాత్ లో మాత్రం మరోసారి ప్రభుత్వం ఏర్పాటు దిశగా బిజెపి కనిపిస్తుంది. ఉత్తర జామ్‌నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన క్రికెటర్ రవీందర్ జడేజా భార్య రివాబా సోలంకి ముందంలో ఉన్నారు. మొత్తంగా బీజేపీ 130 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. లెక్కింపు మొదలైనప్పటి నుంచి బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. గుజరాత్‌లో 2017 ఎన్నికల్లో 99 సీట్లను గెలుపొందిన బీజేపీ.. ఈసారి ఎక్కువ స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఆ పార్టీ 135కిపైగా సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారుతోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 77 చోట్ల విజయం సాధించగా.. ఈసారి అవి సగానికి పడిపోయాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గుజరాత్‌లో ఆ పార్టీ 4 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. హిమాచల్ ప్రదేశ్‌లో కనీసం ఖాతా కూడా తెరవని పరిస్థితి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో సాధారణ మెజార్టీ 35. ఇక్కడ అధికార బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా, నేనా అన్నట్టు పోరు కొనసాగుతోంది. వరుసగా రెండోసారి ఏ పార్టీకీ గత 40 ఏళ్లుగా హిమాచల్‌లో అధికారం దక్కలేదు.