కోటంరెడ్డి పార్టీ మారాలనుకుంటే మారొచ్చు – మంత్రి అమర్ నాథ్

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారాలనుకుంటే మారొచ్చు..కానీ ప్రభుత్వం ఫై ఇలాంటి ఆరోపణలు సరికాదని అన్నారు మంత్రి అమర్ నాథ్. గత కొద్దీ రోజులుగా వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు వార్తల్లో నిలుస్తుంది. సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక రెండు రోజులుగా తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ పై ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తనతో మాట్లాడారని శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ లో బయట పెట్టారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్న విషయాన్ని తనపై అభిమానం ఉన్న ఓ ఐపీఎస్ అధికారి చెప్పారని వెల్లడించారు. కానీ, తాను నమ్మలేదన్నారు. సీఎం జగన్ ను ఇంతగా అభిమానించే, అధికారి పార్టీ ఎమ్మెల్యే అయిన తన ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారని అనుకున్నానని చెప్పారు. తన చిన్ననాటి స్నేహితుడైన ఓ కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడిన సంభాషణ బయటకు వచ్చిందన్నారు.

ఫోన్ ట్యాపింగ్ ఒక్క ఎమ్మెల్యేలతో ఆగదు. మంత్రులు, న్యాయమూర్తులు, ఐపీఎస్ ల ఫోన్లు, విలేకరులు, మీడియా యాజమాన్యాల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు. దీనికి ఎవరైనా ఒప్పుకుంటారా? నేను మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం పట్ల విధేయంగా ఉన్నా. సీఎం జగన్ ను ఎంతగానో అభిమానించా. అవమానాలు ఎదురైనా పార్టీ కోసం కష్టపడ్డా. నన్ను అవమానించిన చోట ఇక నేను ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయను. నాకు నటన చేతకాదు. మోసం చేయడం రాదు. నా ఫోన్ ట్యాపింగ్ చేసి, నా మాటలు దొంగచాటుగా విన్నారని తెలిసినప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ, ఈ రోజు వరకు దాన్ని నా మానసులో దాచుకున్నా’ అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.