పవన్ కు 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియవన్న మంత్రి అమర్నాథ్

వైస్సార్సీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్..మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేసారు. పవన్ కళ్యాణ్ కు అసలు 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియదని , అలాంటి వ్యక్తి సీఎం అవుతాడా అంటూ ఎద్దేవా చేసారు. మొదటి నుండి కూడా అమర్నాథ్..పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం మొదలుపెట్టిన, ఓ ప్రకటన చేసిన , ఎక్కడికి వెళ్లిన దానిపై కౌంటర్ లు , విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు మంత్రి అమర్నాథ్.

ఈరోజు కూడా అలాగే పవన్ ఫై విమర్శలు , ఎద్దేవాలు చేసారు. పవన్ కల్యాణ్ జీవితంలో సీఎం కాలేడని, కనీసం ‘సీఎం పవన్ కల్యాణ్’ అని సినిమా తీస్తే అభిమానులు చూసి సంతోషిస్తారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఒకవేళ అవసరమైతే ఆ సినిమాకు తానే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తానని మంత్రి అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియని వ్యక్తి పవన్ కల్యాణ్… ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారా? అని మంత్రి ప్రశ్నించారు. పవన్ సినిమాల్లోనే పవర్ స్టార్… రాజకీయాల్లో ప్యాకేజీ స్టార్ అని ఎద్దేవా చేశారు.

పవన్ ఎప్పుడూ ఇతరుల కోసం తన పార్టీని ఉపయోగిస్తుంటారని.. 2014లో చంద్రబాబును గెలిపించాలని భావించి పోటీ చేయలేదని, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల కోసం బరిలో దిగి ఓడిపోయారని.. కనీసం 2024లో అయినా పవన్ 175 సీట్లలో పోటీ చేస్తానని చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు. ప్రస్తుతం అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.