మరో నటుడితో అమిత్ షా భేటీ అయితే పవన్ తట్టుకోలేకపోతున్నారుః అమర్ నాథ్
పరిటాల రవి గుండు కొడితే పవన్ బెదిరిపోయాడు

అమరావతిః ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాత్ మరో నటుడు (జూనియర్ ఎన్టీఆర్) భేటీ అయితే పవన్ జిర్ణించుకోలేకపోతున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. మూడు రోజుల పొలిటికల్ కాల్షీట్లతో పవన్ బిజీగా ఉన్నారని అన్నారు. సీఎం జగన్, వైఎస్‌ఆర్‌సిపిపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే… టిడిపి అధినేత చంద్రబాబుతో ఆయనకు డీల్ కుదిరిందని అనిపిస్తోందని చెప్పారు. చంద్రబాబు వల్ల, చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత ఏర్పాటు చేయబడ్డ పార్టీనే జనసేన అని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ పవన్ చేసిన కామెంట్ల నేపథ్యంలో గుడివాడ అమర్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పుట్టినరోజు నాడు చిరంజీవికి పవన్ కల్యాణ్ ఆవేదన మిగిల్చారని అమర్ నాథ్ అన్నారు. పవన్ ను కొణిదెల పవన్ కల్యాణ్ అనాలో, నారా పవన్ అనాలో, నాదెండ్ల పవన్ అనాలో అర్థం కావడం లేదని చెప్పారు. పవన్ చర్యల వల్ల చిరంజీవి అభిమానులుగా తాము ఎంతో బాధపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు లంచం తీసుకున్నట్టు, బెదిరించినట్టు నిరూపించగలరా? అని పవన్ కు గుడివాడ అమర్ నాథ్ సవాల్ విసిరారు. కళ్లుండి కూడా కబోదిగా మాట్లాడితే ఏం చెప్పగలమని అన్నారు. తాము బెదిరిస్తే పవన్ రాష్ట్రంలో తిరగగలరా? ప్రశ్నించారు. పరిటాల రవి గుండు కొడితే పవన్ బెదిరిపోయారని అన్నారు. ఏపీకి మూడు రాజధానుల విధానంలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/