భారీ వరదల ఎఫెక్ట్ : బెంగుళూర్ లో వర్క్ ఫ్రమ్ హోమ్‌కి గ్రీన్ సిగ్నల్

బెంగుళూర్ నగరాన్ని భారీ వర్షాలు , వరదలు అతలాకుతలం చేస్తుండడం తో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పలు ఐటీ సంస్థలు. దీంతో చాలామంది ఉద్యోగులు ఇంటి వద్ద నుండే వర్క్ మొదలుపెట్టారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు బెంగుళూర్ లోని వందలాది కాలనీలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి బెంగళూరు అస్తవ్యస్తమైంది. ఇక ఆదివారం రాత్రి బెంగళూరులో కుండపోతగా వర్షం కురిసింది. సీవీ రామన్ నగరంలో అత్యధికంగా 44 సెంటిమీటర్ల వర్షం కురవగా.. ఇతర ప్రాంతాల్లోనూ 20 నుంచి 30 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

వర్షం కారణంగా ఐటీ కారిడార్‌లోని తమ కంపెనీలకు రూ.225 కోట్ల నష్టం వాటిల్లిందని ‘బెంగళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌ కంపెనీస్‌ అసోసియేషన్‌’ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి లేఖ రాసింది. ఐటీ కార్యాలయాలు, బెంగళూరు ఎయిర్‌పోర్టు, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులను, వరదలో చిక్కుకున్న వారిని ట్రాక్టర్ల మీద, పడవల్లో తరలిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ తరుణంలో వచ్చే ఐదు రోజులూ ఐటీ ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేయాలని ఔటర్ రింగ్ రోడ్డు కంపెనీల అసోసియేషన్ సూచించింది. మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మన్ సాచ్స్, మోర్గాన్ స్టాన్లీ, డెల్, అడోబ్, కేపీఎంజీ సహా మొత్తం 33 కంపెనీలకు ఓఆర్ఆర్‌సీఏ ప్రతినిధి.

బహుళజాతి ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి అయిన హీనా ఖాన్ అనే మహిళ మాట్లాడుతూ.. ఆగస్టు 30 నుంచి తన కంపెనీ ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని కల్పించదని అన్నారు. ‘‘నేను పని చేస్తున్న సంస్థ ఉద్యోగుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత అనే సూత్రాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తూనే ఉంది.. అందుకే మేము ఆగస్టు 30 నుంచి ఇంటి నుంచి పనిచేస్తున్నాం.. ORR‌కు 15 కి.మీ దూరంలో నివసిస్తున్నందున నాకు చాలా ఉపశమనం కలిగింది.. ప్రయాణం చేయడం వల్ల సమయం, శక్తి వృధా అయ్యేది’’ అని ఆమె తెలిపింది.