లండన్ లో మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన అభిమానులు ..

మంత్రి కేటీఆర్‌కు లండన్ లో ఘన స్వాగతం లభించింది. యునైటెడ్ కింగ్డమ్ మరియు దావోస్ పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి లండన్ చేరుకున్నారు కేటీఆర్. లండన్ విమానాశ్రయం లో యూకే కి చెందిన టిఆర్ఎస్ పార్టీ విభాగంతో పాటు అనేక ఎన్ఆర్ఐ సంఘాలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనేక మంది తమ కుటుంబ సభ్యులతో సైతం విమానాశ్రయానికి చేరుకుని కేటీఆర్ కి పూల గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ తో ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు.

ఇక తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కేటీఆర్ ఈ విదేశీ పర్యటన కొనసాగనుంది. బ్రిటన్‌తో పాటు స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. లండన్‌లో మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీకానున్నారు. ఆ తర్వాత ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జరిగే ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో కేటీఆర్‌ పాల్గొంటారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు.ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. ఈ నెల 26న తిరిగి రాష్ట్రానికి కేటీఆర్‌ చేరుకోనున్నారు.