పన్ను విధిస్తే చట్టబద్ధం చేసినట్టు కాదు: ఆర్థిక మంత్రి

క్రిప్టోలను చట్టబద్ధం చేయలేదు.. నిషేధించలేదు: ఆర్థిక మంత్రి సీతారామన్

న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రాజ్యసభలో మాట్లాడారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీల రూపంలో వచ్చే లాభాలపై పన్ను వేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీలపై పన్ను విధించినందున దీని చట్టబద్ధతపై మంత్రికి సభ్యుల నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. పన్ను విధించినంత మాత్రాన ప్రభుత్వం చట్టబద్ధం చేస్తుందనుకోవద్దని చెప్పారు. ‘‘ఈ దశలో క్రిప్టో కరెన్సీలను చట్టబద్దం చేయడం లేదు. అలాగని నిషేధించడం లేదు. సంప్రదింపుల తర్వాత నిషేధించడమా లేక నిషేధించకపోవడమా తేలుతుందన్నారు.

క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై వచ్చే లాభం నుంచి 30 శాతం పన్ను చెల్లించాలని కేంద్ర బడ్జెట్ 2022-23లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదన చేర్చడం తెలిసిందే. క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఉంటుందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీటికి ఎటువంటి అంతర్గత విలువ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తాజాగా ప్రకటించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/