మోడి మిత్రుల కోసం ‘కాంకర్’ ను అమ్మకానికి పెడుతున్నారు
రాహుల్ గాంధీ ఆరోపణ

న్యూఢిల్లీ: ప్రధాని మోడిపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శలు కురిపించారు. మోడి తన స్నేహితుల కోసం అత్యంత లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ‘కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)’ను ప్రైవేటు పరం చేయాలని యోచిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంకర్ యూనియన్ సభ్యులను కలిసిన రాహుల్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం యూనియన్ సభ్యులు ఇచ్చిన పిటిషన్‌ను రాహుల్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘ప్రభుత్వ రంగ సంస్థలో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ ఆభరణం లాంటిది. అత్యంత లాభాలతో నడుస్తున్న సంస్థ. అటువంటి సంస్థను ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని చూస్తోంది. దీంతో ఈ సంస్థను సొంతం చేసుకోవాలని మోదీ ఆశ్రిత పెట్టుబడిదారి స్నేహితులు కొందరు కాచుకు కూర్చుని ఉన్నారు’ అంటూ ట్విటర్లో పోస్టు చేశారు. అయితే కాంకర్ ఉద్యోగులు, కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/