బోయిన్‌పల్లి మార్కెట్‌ను సందర్శించిన గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌ను ఇటీవల ప్రధాని నరేంద్రమోడి ప్రశింసించిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం ఆ మార్కెట్‌ను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సందర్శించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి జ‌నార్ధ‌న్ రెడ్డి స్వాగ‌తం ప‌లికారు. విద్యుత్‌, బ‌యోగ్యాస్ ప్లాంట్ ప‌నితీరును ప‌రిశీలించిన గ‌వ‌ర్న‌ర్‌.. ఆ ప్రాంత‌మంతా క‌లియ‌తిరిగారు. ప‌నుల వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. కూర‌గాయ‌ల రైతుల‌తో గ‌వ‌ర్న‌ర్ మాట్లాడారు.


బోయిన్‌పల్లి మార్కెట్‌లో కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్తు, బయోగ్యాస్‌ తయారు చేయడంపై ఆదివారం నిర్వహించిన ‘మన్‌కీ బాత్‌’లో భాగంగా ప్రధాని ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెత్త నుంచి విద్యుత్తు, బయోగ్యాస్‌ ఉత్పత్తి చేయడమనే సరికొత్త ఆవిష్కరణకు బోయిన్‌పల్లి మార్కెట్‌లో నాంది పలికారని కొనియాడారు. ఈ విధానంలో వ్యర్థాలను ఉపయోగించుకోవడం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. ఇది చెత్తను బంగారంగా మార్చే ప్రయాణమని అభివర్ణించారు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్‌. ఇక్కడ ప్రతిరోజూ 510 టన్నుల కూరగాయల వ్యర్థాలు పోగుపడుతాయి. ఈ వ్యర్థాలను గతంలో జవహర్‌నగర్‌లోని డంపింగ్‌ యార్డ్‌కు తరలించేవారు. ఇందుకోసం కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ, ప్రభుత్వం వ్యర్థాల నుంచి విద్యుత్తుతోపాటు, బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు 30 కోట్ల రూపాయలతో బయోప్లాంట్‌ను ఏర్పాటుచేసింది.


కాగా, బోయిన్‌పల్లి మార్కెట్‌ నుంచి వెలువడుతున్న కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్తు, బయోగ్యాస్‌ తయారీకి అధికారులు హైదరాబాద్‌కే చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో.. ప్రతి రోజు 10 టన్నుల వ్యర్థాలను ఉపయోగించే సామర్థ్యంతో బయోప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ప్రతిరోజూ 6 నుంచి 8 టన్నుల వ్యర్థాలను ఉపయోగించి 8001000 యూనిట్ల విద్యుత్తుతోపాటు, బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటివరకు 1,400 టన్నుల వ్యర్థాల నుంచి 32వేల యూనిట్ల విద్యుత్తును, సుమారు 600 కేజీల బయోగ్యాస్‌ ఉత్పత్తి చేసినట్లు బోయిన్‌పల్లి మార్కెట్‌ సెక్రటరీ ఎల్‌ శ్రీనివాస్‌ తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/